- మంత్రి ధనసరి అనసూయ
ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గ అబివృద్ధికి అధికారులు, లీడర్లు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సూచించారు. మండలంలోని ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాలతో కలిసి మంత్రి నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అడవుల వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలుంటాయో అటవీ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గిరిజనులకు ఐటీడీఏలో అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పారు.
కొత్త ఐటీడీఏ భవనం కోసం ప్రపోజల్స్ సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.10కోట్ల నిధులను కేటాయించినట్టు తెలిపారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతం చేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉందని, వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీ సిరిశేట్టి సంకీర్త్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి, డీఆర్ డీఓ శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ : మంత్రి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతుందని, అర్హులైన ప్రతీ ఇంటికి గృహజ్యోతి పథకం అమలు అవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బుధవారం ములుగులోని సుభాష్ నగర్, సఫాయివాడలో లబ్ధిదారులకు జీరో బిల్ అందించారు. గత ప్రభుత్వం ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చుర్, డీఈ నాగేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.