![మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి](https://static.v6velugu.com/uploads/2025/02/minister-danasari-seethakka-inspected-arrangements-for-mini-medaram-in-mulugu-district_HihFmnPN8u.jpg)
- వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
- ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లాలో మినీ మేడారం ఏర్పాట్లను మంత్రి దనసరి సీతక్క పరిశీలించారు. ముందుగా మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అన్నారు. ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రి అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమైనారు.
ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర
ఈ నెల 12 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలన్నారు.
వైద్యశాఖ అన్ని రకాల మందులను ఉంచాలని, అత్యవసర సమయాల్లో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రాలకు తరలించేందుకు వెహికల్స్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలన్నారు.
చలువ పందిళ్ల ఏర్పాటు చేయాలి
భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నందు వల్ల గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లను ఏర్పాట్లు చేశామన్నారు. దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేశామన్నారు.
జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగు దొడ్లను ఏర్పాటు చేశామని, తాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేస్తామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు.
ఆమె వెంట ఎండోమెంట్ ఈవో రాజేంద్రన్, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధ బోయిన జగ్గారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ శాఖ చైర్మన్ బానోత్ రవిచందర్, పూజారులు, ఎండో మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.