ములుగు, వెలుగు : మేడారం వచ్చే భక్తులు మొదట గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ఆదేశించారు. మంగళవారం గట్టమ్మను దర్శించుకున్న అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గట్టమ్మ ఆలయం వద్ద కనీస సౌలత్‌లు కల్పించాలన్నారు.
ALSO READ :- మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలి : కొత్వాల శ్రీనివాసరావు
తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం తన స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో కొత్తగా నిర్మించిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని, పుట్ట మల్లన్న గుడి వద్ద బోరు మోటార్‌ను ప్రారంభించారు. అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలని సూచించారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, డీఎస్పీ రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత పాల్గొన్నారు.