గ్రామాలకు బడ్జెట్ లో అధిక నిధులు: మంత్రి సీతక్క

గ్రామాలకు బడ్జెట్ లో అధిక నిధులు: మంత్రి సీతక్క

మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్​లో ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి సీతక్క అన్నారు. బయ్యారం మండలంలోని లక్ష్మీనరసింహాపురం, కోడిపుంజుల తండా, మొట్ల తిమ్మాపురం, కోటగడ్డ, కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్  గ్రామాల్లో అంతర్గత రోడ్లు, బ్రిడ్జిలు, పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులను  ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్ లతో కలిసి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు.  

ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ..  ఇల్లందు నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. బయ్యారం పెద్ద చెరువును ఆధునీకరించాలని కోరారు. అనంతరం మంత్రి సీతక్క మహిళలతో కలిసి నృత్యం చేశారు. కొత్తగూడ గాంధీ నగర్ లో గిరిజన ఆశ్రమ సంక్షేమ ఉన్నత పాఠశాల, కాలేజీలో జగతి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్లు అందజేశారు. రైతు వేదికలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కొత్తగూడలో కుంజ రాము జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎస్పీ సుధీర్ రామ్​నాథ్​ కేకన్, మహబూబాబాద్​ ఆర్డీవో కృష్ణవేణి,  బయ్యారం పీఏసీఎస్​ చైర్మన్​ మూల మధుకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.