ప్లాస్టిక్‌‌తో మేడారం రావొద్దు : ధనసరి సీతక్క

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరను ప్లాస్టిక్‌‌ రహితంగా నిర్వహించుకోవాలని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క సూచించారు. మేడారంలో ప్లాస్టిక్‌‌ వాడొద్దంటూ స్టూడెంట్లు, పూజారులతో కలిసి శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం వచ్చే భక్తులు కాటన్‌‌ సంచులు మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. 

ప్లాస్టిక్‌‌ రహిత జాతర నిర్వహణ కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠితో కలిసి మేడారం రోడ్లను చీపుర్లతో ఊడ్చివేశారు. జాతరకు వచ్చే భక్తులు పరిశుభ్రత పాటించాలన్నారు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు పడేయడం వల్ల ఇతరులు ఇబ్బంది పడుతారన్నారు. జాతర పరిసరాలు, చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. 

మేడారం జాతరలో డ్యూటీ చేసే వారికి ఆహారం అందించేందుకు ఏటూరు నాగారం మండలం ఎక్కెళ్లకు చెందిన సమ్మక్క సారలమ్మ జాయింట్‌‌ లయబిలిటీ గ్రూప్‌‌, పస్రా నాగారం గిరిజన జాయింట్‌‌ లయబిలిటీ గ్రూప్‌‌కు ఫుడ్‌‌ సప్లై ట్రక్స్‌‌ను అందజేశారు. కార్యక్రమంలో డీపీవో వెంకయ్య, పూజరుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, నాయకులు రవళిరెడ్డి, రేగ కల్యాణి పాల్గొన్నారు.

త్వరలో కొండాయి – ఊరట్టం రోడ్డు పనులు

ఏటూరునాగారం, వెలుగు : కొండాయి నుంచి మేడారం సమీపంలోని ఊరట్టం వరకు త్వరలోనే బీటీ రోడ్డు వేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. కొండాయి వద్ద జంపన్నవాగుపై బ్రిడ్జి కూలిపోవడంతో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డును శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం మల్యాలలో సమ్మక్క, కొండాయిలో గోవిందరాజుల,  నాగులమ్మ ఆలయాలను దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మేడారం జాతరకు వచ్చే అన్ని రోడ్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. జాతర పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ శ్రీజ, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ ఉన్నారు.

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

ములుగు, వెలుగు : స్పెషల్‌‌ ఆఫీసర్లు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు కలెక్టరేట్‌‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో ఆమె మాట్లాడారు. ప్రత్యేక ఆధికారులు పంచాయతీరాజ్‌‌ చట్టంపై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య డ్రైవ్‌‌ నిర్వహించాలని ఆదేశించారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే వచ్చే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి నియోజకవర్గానికి రూ. కోటి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గ్రామాల్లో మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం సివిల్‌‌ సప్లై కార్పొరేషన్‌‌ పరిధిలో పనిచేస్తున్న 674 మంది ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అలాగే సైకాలజిస్ట్‌‌ అసోసియేషన్‌‌ ములుగు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.