
హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు నిర్మాణం కోసం రూ.1000 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం అడ్వకేట్లు, గుమాస్తాల సంక్షేమ చట్టం సవరణ బిల్లు 2025 ను ప్రవేశపెట్టిన సందర్భంగా.. సభ్యులు ప్రస్తావించిన అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి 100 ఎకరాల స్థలం కేటాయించిన విషయం గుర్తుచేశారు.
నూతన హైకోర్టు, న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణానికి రూ.2,600 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. అడ్వొకేట్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 55 వేల మందికి రూ.2 లక్షల పరిమితితో హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.