పెద్దపల్లి, వెలుగు: బ్యాంకు ఖాతాల్లో పడ్డ రైతుభరోసా డబ్బులను రైతులు డ్రా చేసుకోకుండా బీజేపీ కుట్ర చేసి ఆపేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రైతుల నోటికాడి బుక్కను లాగేశారని.. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంగళవారం ఆయన మీడియాతో మట్లాడారు. చెప్పిన టైం కంటే ముందే సీఎం రేవంత్‌రెడ్డి రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారని.. కానీ, ఖాతాల్లో పడ్డ డబ్బులను రైతులు డ్రా చేసుకోకుండా ఎలక్షన్ కమిషన్‌ను అస్త్రంగా చేసుకొని బీజేపీ కుట్ర చేసిందని ఆయన ఫైర్ అయ్యారు.
రైతుభరోసా ఆన్‌గోయింగ్ స్కీం అని ఈసీకి తెలియదా? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీకి మొదటి నుంచీ రైతులు అంటే ద్వేషమని అన్నారు. గతంలో కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి వందల మంది రైతులను పొట్టన పెట్టుకుందన్నారు. బీఆర్ఎస్ గత పదేండ్లలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిధులను ఆచీతూచి ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులను ఆదుకోవాలని బ్యాంకులలో రైతుభరోసాకు సంబంధించిన నిధులను జమచేశామన్నారు. బీజేపీ కుట్రలను రైతులు గమనించాలన్నారు. 2018లో ఎన్నికల రోజున ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులను ఖాతాలలో వేసిందని గుర్తుచేశారు. అప్పుడు బీజేపీ నోరుమెదపలేదని, ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా, ఎంపీపీ కొండ శంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.