ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంథని మండలం ఖానాపూర్ నుంచి ఎల్.మడుగు వరకు రూ.7 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌‌ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

 పెద్దపల్లి జిల్లాలో  రైతులకు సంబంధించి సన్న రకాలకు బోనస్ కింద రూ.20 కోట్లకు పైగా జమ చేసినట్లు చెప్పారు. తాను ప్రాతినిధ్య వహిస్తున్న మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం కోసం గోదావరిపై రూ.120 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు. మున్సిపల్ చైర్‌‌పర్సన్  రమాదేవి, వైస్ చైర్మన్ బానయ్య, ప్యాక్స్ చైర్మన్  శ్రీనివాస్,  లీడర్లు సదానందం, జగన్మోహన్‌రావు, బాలాజీ, ప్రసాద్, శశిభూషణ్ పాల్గొన్నారు.