- ఒక్కో నియోజకవర్గంలో 2 నుంచి 3 ఎకరాలు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: అన్ని నియోజకవర్గాల్లోనూ స్వయం సహాయక బృందాల కోసం ఏర్పాటు చేయనున్న మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూ సేకరణ చేపట్టాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. ఒక్కో పార్కుకు 2 ఎకరాల నుంచి 3 ఎకరాల భూమి సేకరించాలని సూచించారు. ఒక్కో పార్కులో రెండు అంతస్తుల భవనాలను నిర్మించాలని, 30 నుంచి 50 స్వయం సహాయక బృందాలకు ప్లగ్ అండ్ ప్లే రీతిలో వసతి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
మంగళవారం ఆయన సచివాలయంలో సెర్ప్, టీజీఐఐసీ, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడున్న 64 లక్షల స్వయం సహాయక బృందాల సంఖ్యను 75 లక్షలకు పెంచాలని ఆదేశించారు. కొత్తగా ఎవరిని చేర్చవచ్చో పరిశీలించాలని సూచించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం తేలికేనని, కానీ, వారి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్లడమే సవాలుతో కూడుకున్న అంశమని అన్నారు.
దీని కోసం పరిశ్రమల శాఖ అవసరమైతే ఒక సప్లయ్ చెయిన్ కన్సల్టెంట్‌ను నియమించాలని ఆదేశించారు. ప్రతి మహిళ కోటీశ్వరురాలిగా ఎదగాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని పేర్కొన్నారు. వారిలో సగం మందిని చేయగలిగినా గొప్ప లక్ష్యాన్ని సాధించినట్టేనని తెలిపారు. పొదుపు సంఘాల మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ‘సరస్’ ఉత్పత్తుల ప్రదర్శనలు అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో సెర్ప్ సీఈవో దివ్య, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల డైరెక్టర్ డా.మల్సూర్, ఎలీప్ వ్యవస్థాపకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా 2025 సదస్సు లోగోను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25, 26న హైటెక్స్‌లో నిర్వహించే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి పేర్కొన్నారు. స్వీడన్ లైఫ్‌సైన్సెస్ కంపెనీల ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు.