- హైదరాబాద్కు దీటుగా వరంగల్ ను డెవలప్చేస్తం
హనుమకొండ, వెలుగు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్ లో పడిపోయాయని, గత ప్రభుత్వానికి చెప్పినా పెడచెవిన పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని, హైదరాబాద్కు దీటుగా వరంగల్ ను డెవలప్ చేస్తామని తెలిపారు. హనుమ కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను స్థానిక మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలసి సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికాక ముందే వరంగల్ కు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..గత పాలకులు మైకుల ముందు ఊదరగొట్టడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు.