అమరుల కుటుంబాలను ఎందుకు విస్మరించారు? : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

అమరుల కుటుంబాలను ఎందుకు విస్మరించారు? : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్​ కాదా?: శ్రీధర్​బాబు​
  • కాళేశ్వరంతో లక్ష ఎకరాలకైనాసాగునీరు ఇచ్చారా? 
  • బీఆర్​ఎస్ నేతలకు మంత్రి పది ప్రశ్నలు
  • పేదల పక్షాన పోరాడేదికాంగ్రెసేనని వెల్లడి 
  • రాహుల్ పై పిచ్చి కామెంట్లు చేస్తే పెద్దోళ్లమై పోతామని భ్రమ పడుతున్నరని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతున్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష స్థానంలో ఉన్నా పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, తమ నేత రాహుల్ గాంధీపై బీఆరెస్ నేతలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ మంగళవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు ఆయన పది ప్రశ్నలు సంధించారు.

 మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1,200 మంది అమరుల కుటుంబాలను బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు విస్మరించారో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘2014 జూన్ 14న సీఎం హోదాలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానంలో 1,200 బలిదానాలు జరిగినట్టు కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక మాట మార్చి అమరుల సంఖ్యను 585 కు కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 615 మంది ఏమై పోయారో ఎప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా? ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, ఇల్లు, సాగు భూమి, కుటుంబానికో ఉద్యోగం, ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తామని ఎన్నో హామీలిచ్చారు. 

కొద్ది మందికి నగదు, ఉద్యోగాలు ఇచ్చి అత్యధిక మందికి ఒక్క హామీ నెరవేర్చలేదు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం పీఠంపై కూర్చోబెడతామన్న పెద్దలు అసలా మాటే అననే లేదని నాలుక మడత పెట్టింది వాస్తవం కాదా.?  దళిత కుటుంబాలకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి నీటి మూట అయింది వాస్తవం కాదా? తెలంగాణ తల్లిగా సోనియమ్మను పొగిడిన నోళ్లతోనే మీరు ఆ కుటుంబాన్ని కించ పరుస్తున్న విషయం ప్రజలకు తెలియదనుకుంటున్నారా? పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నది ఎవరు? మాట తప్పింది ఎవరు? తెలంగాణను  ఇచ్చిన సోనియమ్మ, రాహుల్ గాంధీలు అకస్మాత్తుగా శత్రువులు ఎలా అయ్యారు ? అధికారం లోకి వచ్చిన వెంటనే నిరుద్యోగం అనేది ఉండదని ఆశలు కల్పించి.. ఉద్యోగాలు కల్పించకుండా మోసగించింది మీరు కాదా?’’ అని మంత్రి శ్రీధర్​బాబు ప్రశ్నించారు. 

పదేండ్లలో మీరు కట్టిన ఇండ్లు ఎన్ని?

‘‘గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకయైనా సమర్థించుకున్న చరిత్ర ఎవరిది? ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం నివాసాలు నిర్మించి ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి పదేళ్లలో మీరు కట్టింది ఎన్ని?  పంపిణీ చేసింది ఎన్ని?  కేజీ టు పీజీ విద్య హామీ అసలు మీకు గుర్తుందా?’’ అని మంత్రి శ్రీధర్​బాబు నిలదీశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాల్లోని 16,40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని నమ్మబలికారు. 

మరి లక్ష ఎకరాలైనా సాగులోకి వచ్చిందా? మేం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. మా అధినేత రాహుల్ గాంధీ దేశమంతా పర్యటిస్తున్నారు. అధికారం కోల్పోయాక ఇంటికే పరిమితమై బయటకు రానిది మీ పార్టీ అధినేత కాదా? రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడితే పెద్దోళ్లమై పోతామని భ్రమ పడుతున్నట్టున్నారు. ఆయన జాతీయ నేత. ఉప ప్రాంతీయ పార్టీగా మారి ఉనికి కోల్పోతున్న రాజకీయ పక్షం నాయకులు మీరు’’ అని శ్రీధర్​ బాబు మండిపడ్డారు.