ఇండస్ట్రీ గ్రోత్ కు మూలస్తంభంలా టీహబ్ :మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • దీనిని ఇన్నొవేషన్ పవర్ హౌస్ గా మారుస్తం: శ్రీధర్ బాబు
  • ఘనంగా టీహబ్ 9వ వార్షికోత్సవం.. 
  • ఏరోస్పేస్, డిఫెన్స్ స్టార్టప్​ల కోసం టీ డ్రైవ్ ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు:  టీహబ్​ను కోవర్కింగ్ స్పేస్ నుంచి ఇన్నొవేషన్ సెంటర్​గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్టార్టప్​లకు ఊతమిచ్చే హబ్​గా ఉన్న సంస్థను.. ఇంటెలిజెన్స్​హబ్​గా, ఒక పవర్​హౌస్​గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శుక్రవారం టీహబ్ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూనికార్న్​లను (యూనికార్న్​లుగా ఎదుగుతున్న స్టార్టప్​లు) మరింత మెరుగుపరిచి తదుపరి యూనికార్న్​లుగా మార్చేందుకు టీహబ్ ప్రయత్నిస్తున్నదన్నారు.

గ్రాంట్స్, వ్యూహాత్మక నిధుల సమీకరణ ద్వారా సంస్థలను ఇంక్యుబేట్ చేసేందుకు దోహదం చేస్తున్నదని చెప్పారు. ఇండస్ట్రీ గ్రోత్​కు టీహబ్ మూలస్తంభంలా మారుతున్నదని, కొత్త ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల తయారీలో తెలంగాణను ప్రపంచ లీడర్​గా నిలబెట్టడంలో టీహబ్​ది కీలక పాత్ర అని అన్నారు. స్టార్టప్​లకు బూస్ట్​నిచ్చేందుకు టీహబ్ స్థిరంగా ముందుకు వెళ్తున్నదని, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందిస్తున్నదని టీహబ్ సీఈవో సుజీత్​ జాగిర్దార్ చెప్పారు. ఈ సందర్భంగా ఎక్స్​పీరియన్స్ సెంటర్ 2.0ని టీహబ్ ప్రారంభించింది. 20 స్టార్టప్​లకు చెందిన ఆవిష్కరణలను దీని ద్వారా ప్రదర్శించనున్నారు. దాంతోపాటు డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగంలో స్టార్టప్​లను ప్రోత్సహించేందుకు టీ డ్రైవ్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీ, ఇండస్ట్రీస్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.   

బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఆవిష్కరణ

ఐఐసీటీ సహకారంతో గ్రీన్ వర్క్స్ బయో అనే సంస్థ తయారుచేసిన బయో డీగ్రేడబుల్ ప్లాస్టిక్​ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​తో కలిసి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్​కు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని జితేంద్ర సింగ్ చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్​తో తీవ్రమైన కాలుష్య సమస్య వస్తుందన్నారు. కాలుష్య రహిత ఉత్పత్తుల రీసెర్చ్​కు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం అందిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ను పూర్తిగా నిర్మూలించాలన్నారు.

వాటికి ప్రత్యామ్నాయంగా ఇలాంటి బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు అందుబాటులోకి రావాలని ఆకాక్షించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రీన్ వర్క్స్ బయోలాంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు. ఐఐసీటీ డైరెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, గ్రీన్ బయోవర్క్స్ డైరెక్టర్ రిషికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రధార డెయిరీ లోగో ఆవిష్కరణ

ఎంఎస్ఎంఈలతో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతున్నదని శ్రీధర్ బాబు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ఇటీవలే ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చిందన్నారు. శుక్రవారం ‘డెయిరీ ట్రెండ్’ పేరుతో ప్రధార డెయిరీ సంస్థ పాల ఉత్పత్తుల లోగోను బేగంపేటలోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఆయన ఆవిష్కరించారు.

ప్రధార డెయిరీ రూ.20 కోట్ల పెట్టుబడితో షాద్​నగర్ సమీపంలోని పెంజర్లలో డెయిరీ ప్లాంటును ఏర్పాటు చేసిందని, దీని ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 200 మంది ఉపాధి పొందుతారని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో షాద్​నగర్​ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, నిర్మాత బండ్ల గణేశ్, సినీ హీరో విశ్వక్ సేన్, ప్రధార డెయిరీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.