- ఆయన సమర్థత చూసే హైకమాండ్ టికెట్ ఇచ్చింది
- వంశీకృష్ణ మంచి విజన్ఉన్న లీడర్
- చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలే
- స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ బాధ్యతలువంశీకే అప్పగిస్తామని వెల్లడి
పెద్దపల్లి, వెలుగు: గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ఏర్పాటుకు కృషి చేస్తామని ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మంచి విజన్ ఉన్న లీడర్ అని, ఆయన నైపుణ్యం, సమర్థతను గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ టిక్కెట్ఇచ్చిందని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో శ్రీధర్‌బాబుతోపాటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్ఠాకూర్మక్కాన్ సింగ్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ నాయకత్వంలో రైతులందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ మాత్రమే రైతులకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఏడాదిపాటు రైతులు దీక్ష చేశారని, 72 మంది మరణించారని.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు.
రాజకీయ లబ్ధి పొందేందుకు రైతు దీక్ష పేరుతో బీఆర్ఎస్అన్నదాతలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ లక్ష్యమని, ఇదే అంశాన్ని ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదిపాటు నైపుణ్య శిక్షణ అందిస్తామని, అప్రెంటిస్ పీరియడ్‌లో నెలకు రూ. 8,500 వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కోసం యూనివర్సిటీ ప్రారంభించబోతున్నారని, వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తామని చెప్పారు.
వంశీ గెలిస్తే అందుబాటులో ఉంటడు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే తనలాగే ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. ఇక్కడ నుంచి కాకా వెంకటస్వామిని పెద్దపల్లి ప్రజలు 4 సార్లు ఎంపీగా గెలిపించారని, 2009లో తనను ఎంపీగా గెలిపించారని, దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు వెంకటస్వామి కుటుంబాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. యువకుడైన వంశీ.. కాకా లాగానే ప్రజలకు సేవ చేస్తారని, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై స్పందిస్తారని తెలిపారు. గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వంశీ గెలుపు ఖాయమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. వివేక్ వెంకటస్వామికి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో వంశీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో కాంగ్రెస్ బలపడుతుందని అన్నారు. పెద్దపల్లిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దాని కంటే వంశీ కృష్ణకు ఎక్కువ మెజార్టీ రావాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త వచ్చే 25 రోజులు కష్టపడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ రంగానికి అప్పగించాలని చూస్తున్న బీజేపీని బొంద పెట్టాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. ఆ పార్టీ రాముడిపేరు తో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. పదేండ్లు అధికారంలో ఉన్న మాజీ మంత్రి కొప్పుల చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కొప్పుల లోపల ఒక ఈశ్వరుడు.. బయట మరో ఈశ్వరుడు ఉంటారని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు.
పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి తాను కృషి చేస్తానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో ఎన్ని వేధింపులకు గురిచేసినా తట్టుకొని నిలబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కన్నుమూస్తానని తన తాతా కాకా వెంకటస్వామి అనేవారని, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని వంశీకృష్ణ మండిపడ్డారు.
కాకా కార్మిక నాయకుడిగా పేదలకు పట్టాలు ఇప్పించి, ఆ స్థలాల్లో గుడిసెలు వేయించారని, గుడిసెల వెంకటస్వామిగా ఆయన పేరు పొందారని గుర్తు చేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తోందన్నారు. తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రతి ఇంటికి చిన్న కొడుకులాగా పని చేస్తానని చెప్పారు. కాగా, ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ జడ్పీటీసీలు, నాయకులు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.