ఏమాత్రం లక్షణాలున్నా.. దవాఖానలో చూయించుకోండి

ఏమాత్రం లక్షణాలున్నా.. దవాఖానలో చూయించుకోండి
  • కరోనా సోకిన మూడ్నాలుగు రోజుల్లోనే సీరియస్​ అవుతోంది
  • ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ప్రాణాలమీదకొస్తోందని కామెంట్​
  • ఆక్సిజన్​ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ
  • రాష్ట్రంలో మాత్రం కొరత లేదన్న మంత్రి ఈటల

సీఎంతో సహా చాలా మంది లీడర్లు కరోనా బారిన పడ్డారు. వాళ్లు సర్కార్​ దవాఖాన్లలో చేరితే.. ప్రజల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెరుగుతుంది కదా?
–‘వీ6’ చానెల్​లో గురువారం ఈటలతో ఇంటర్వ్యూలో యాంకర్​ అడిగిన ప్రశ్న ఇది.

‘‘నిమ్స్​, టిమ్స్​ ప్రభుత్వాసుపత్రులు కాదా! మాలాంటి వీఐపీలూ ప్రభుత్వ దవాఖాన్లలో చేరుతున్నారు. వేరే ఆసుపత్రులతో పోలిస్తే నిమ్స్​, టిమ్స్​లు గొప్ప సేవలు అందిస్తున్నాయి. సీరియస్​గా ఉన్న పేషెంట్లను చివరి నిమిషంలో ప్రైవేట్​ ఆసుపత్రులు వెళ్లగొడుతున్నాయి. అలాంటి టైంలో బెడ్డిచ్చి, వారి ప్రాణాలను కాపాడుతున్న ఆసుపత్రి గాంధీ.’’

- ఇదీ మంత్రి ఈటల జవాబు

హైదరాబాద్​, వెలుగు: కరోనా సోకిన మూడు, నాలుగు రోజుల్లోనే పేషెంట్లకు సీరియస్​ అవుతోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కాబట్టి లక్షణాలు కొంచెమే ఉన్నా వెంటనే దవాఖానకు వెళ్లాలని సూచించారు. డాక్టర్​ సూచనల ప్రకారం ఆసుపత్రిలో అడ్మిట్​ అవ్వడమో లేదా మందులు వాడడమో చేయాలన్నారు. గురువారం ఆయన సెక్రటేరియట్​లో మీడియాతో మాట్లాడారు. లక్షణాలు కనిపించాక ఇంట్లోనే ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జనానికి సూచించారు. ఇంట్లోనే ఉండి లేట్​ చేయడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతోందని, ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లినా, బెడ్లు దొరికినా బతకడం కష్టం అవుతుందని హెచ్చరించారు. రాష్ర్టంలో రోజూ లక్షకుపైగా టెస్టులు చేస్తున్నామన్నారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఆర్టీపీసీఆర్​ టెస్టులు సాధ్యం కాదని చెప్పారు. ఢిల్లీలో లాక్​డౌన్​తో యాంటీజెన్​ కిట్లు రావడం ఆలస్యమైందే తప్ప, కిట్ల కొరత లేదని ఆయన అన్నారు. 

ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత
ఆక్సిజన్​, రెమ్డెసివిర్​ కేటాయింపుల్లో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఈటల అన్నారు. ఆక్సిజన్​ కొరత ఏర్పడి రాష్ట్రంలో ఏదైనా జరగరానిది జరిగితే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ప్రస్తుతం కొన్ని చిన్న దవాఖాన్లలోనే ఆక్సిజన్​ కొరత ఉందని ఆయన చెప్పారు. అది కూడా సిలిండర్లను కొందరు బ్లాక్​ చేయడం వల్లే జరుగుతోందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్​ ఆసుపత్రుల్లో కలిపి రోజూ 260 టన్నుల ఆక్సిజన్​ను వాడుతున్నారని, మున్ముందు అది 360 నుంచి 380 టన్నులకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. 

తమిళనాడు ఇయ్యట్లె
బళ్లారి, విశాఖపట్నం, భిలాయ్​, హొస​పేటె, శ్రీపెరంబదూర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కళింగనగర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్​ కేటాయింపులు చేసిందని ఈటల చెప్పారు. శ్రీపెరంబదూర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 35 టన్నులను కేటాయించినా.. తమిళనాడు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్​ నుంచి ఒడిశాలోని కళింగనగర్​ దాదాపు 1,300 కిలోమీటర్ల దూరంలో ఉందని, అక్కడి నుంచి ఆక్సిజన్​ తెచ్చుకునేందుకు ట్యాంకర్లు దొరకడం లేదని చెప్పారు. దీంతో విశాఖ, భిలాయ్​ స్టీల్​ ప్లాంట్ల నుంచే ఆక్సిజన్​ను కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. కేటాయింపులను మార్చకుంటే ఆక్సిజన్​ కొరత ఏర్పడే ప్రమాదముందన్నారు.

రెమ్డెసివిర్​ ఎక్కువస్తయనుకున్నం
రెమ్డెసివిర్​ మందులు మన రాష్ట్రంలోనే తయారవుతున్నందున ఎక్కవ ఇంజెక్షన్లు వస్తాయనుకున్నామని, కానీ, ఇప్పటిదాకా కేంద్రం 21,559 ఇంజెక్షన్లను మాత్రమే ఇచ్చిందని ఈటల అన్నారు. 4 లక్షల ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరితే చాలా తక్కువ ఇచ్చిందన్నారు. కానీ, గుజరాత్​, మహారాష్ర్ట, ఢిల్లీ, మధ్యప్రదేశ్​కు మాత్రం ఎక్కువ ఇచ్చారని ఆరోపించారు. మహారాష్ర్ట, కర్నాటక, ఏపీ నుంచి కూడా రాష్ట్రానికి వందల మంది పేషెంట్లు వస్తున్నారని, వాళ్లనూ దృష్టిలో పెట్టుకుని ఇంజెక్షన్ల కేటాయింపులు పెంచాలని ఆయన డిమాండ్​ చేశారు. వ్యాక్సిన్​ ధరను కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400గా నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనమన్నారు.

చివరిదాకా ప్రయత్నించాలె
కొన్ని చిన్న హాస్పిటళ్లు, కార్పొరేట్​ ఆసుపత్రులు పేషెంట్లను చివరి క్షణంలో గాంధీకి పంపిస్తున్నాయని ఈటల అన్నారు. అది కరెక్ట్​ కాదని, పేషెంట్​ను బతికించేందుకు చివరి దాకా ప్రయత్నం చేయాలని సూచించారు. ఇంజెక్షన్లు, ఆక్సిజన్​ను బ్లాక్​ చేయడం, అడ్డగోలు బిల్లులు వేస్తూ శవాలపై పేలాలు ఏరుకోవద్దంటూ హాస్పిటళ్లపై మండిపడ్డారు. గాంధీలో వెంటిలేటర్​ బెడ్లన్నీ ఫుల్​ అయిపోయాయని చెప్పారు. 

మాట మార్చిన ఈటల
రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టే ఆక్సిజన్​, రెమ్డెసివిర్​ లను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోందని ఈ నెల 18న చెప్పిన ఈటల.. ఇలాంటి విషయాల్లో రాజకీయం చేయడం మంచిది కాదని అన్నారు. అయితే, గురువారం నాటి ప్రెస్​మీట్​లో మాత్రం కేంద్రం వివక్ష చూపుతోందంటూ మాట్లాడారు. రాష్ర్టంలోని అసలు పరిస్థితిని, కరోనా అసలు లెక్కలు, చావులను దాచి పెట్టడం వల్లే ఇలా జరుగుతోందా అని మంత్రిని ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు. రాష్ర్టంలోని హాస్పిటళ్లలో ఇతర రాష్ర్టాల పేషెంట్లే 60 నుంచి 70 శాతం మంది ఉన్నారని చెప్పారు. నిజానికి ఇతర రాష్ర్టాల పేషెంట్లు 30 శాతం కూడా లేరు. ఇక కేవలం 5 శాతం మందే హాస్పిటలైజ్​ అవుతున్నారనీ అన్నారు. ప్రస్తుతం 49,781 యాక్టివ్​ కేసులుంటే, 16,300 మంది దవాఖాన్లలో ఉన్నారు. అంటే, మొత్తం యాక్టివ్​ కేసుల్లో 32 శాతం మంది హాస్పిటల్స్​లోనే ఉన్నట్టు లెక్క.