మళ్లీ గెలిపిస్తే హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి

మళ్లీ  గెలిపిస్తే హామీలన్నీ  అమలు చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్.. రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. రైతుబంధును ఆపాలని ఈసికి పిర్యాదు చేయడంతో రైతుల పట్ల కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధి అర్థమవుతుందని.. రైతుల పట్ల కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం లేదని...  కాంగ్రెస్ ఇచ్చే హామీలు వారు పాలించే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అమలు అవుతున్నాయో చెప్పాలని మండిపడ్డారు.

ప్రజలను మరోసారి మోసం చేసేందుకు  కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని.. కాని,  ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని చెప్పారు. 2023, అక్టోబర్ 27వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేయాలని మంత్రి  కోరారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా... 75 నుంచి 85 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

ఈ ఎన్నికల్లో  ప్రజా తీర్పు వన్ సైడ్ గా ఉంటుందని.. ప్రజలు మరోసారి గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ  అమలు చేస్తామని ఆయన చెప్పారు. మళ్లీ  గెలిపించకుంటే తెలంగాణ ప్రజల కోసం పోరాడుతామని... తనకున్న రాజకీయ అనుభవంతో చెబుతున్నా అలాంటి పరిస్థితి రాదనుకుంటున్నా అని- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.