వరంగల్: జాతీయ స్థాయిలో రెండు ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్ ను అభినందించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లా (రూరల్), ఆత్మకూరు మండలం, అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన పుప్పల రమా-కుమారస్వామి దంపతుల కూతురు కళ్యాణి.. సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజీ లో చదువుతుంది. అయితే ఇటీవలే ఆమె జాతీయ స్థాయిలో రెండు ఉత్తమ ర్యాంకులు సాధించింది. దేశంలోని రెండు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ లలో రెండు సీట్లు సాధించింది.
డెహ్రాడూన్ ఎఫ్ఆర్ఐ లో ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించి, ఎమ్మెస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీటు సంపాదించింది. అలాగే, వారణాసి (కాశీ) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 13వ ర్యాంక్ సాధించి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ విభాగంలోను సీటు సంపాదించింది. రెండు చోట్ల సీటును సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన కళ్యాణికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఉమ్మడి వరంగల్ జిల్లా పేరును నిలబెట్టిందని కొనియాడిన మంత్రి ఎర్రబెల్లి.. విద్యార్థులు కళ్యాణిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.