
పాలకుర్తి/తొర్రూరు, వెలుగు : అమెరికా నుంచి తన పిల్లలు పంపిన పైసలతో ప్రజాసేవ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని హట్యాతండా, బీక్యా నాయక్ పెద్ద తండా, టీఎస్‌కే తండాలో కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్‌ల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మాస్క్‌లు, మందులు, నిత్యావసర సరుకులు అందించి ప్రజలను కాపాడుకున్నానని, అప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అమెరికా నుంచి తన కొడుకు, కూతురు, మనుమడు పంపిస్తున్న డబ్బులతో నెల్లూరు ఆనందయ్య మందు తెప్పించి నియోజకవర్గంలో ప్రజలకు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో గ్రామాలకు రావాలంటే మోకాలిలోతు బురద రోడ్డు ఉండేదని ఇప్పుడు ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు వేయించినట్లు చెప్పారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తాగేందుకు నీళ్లు కూడా దొరికేవి కావని, ప్రస్తుతం మిషన్ భగీరథ నీటితో ఇంటింటికీ నీరిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ లీడర్ల మాటలకు మోసపోవొద్దని సూచించారు. అనంతరం ఉపాధి కూలీలకు ఎర్రబెల్లి ట్రస్ట్ఆధ్వర్యంలో లంచ్బ్యాగులు పంపిణీ చేశారు.
ఎంపీటీసీ గుగులోతు వసంత, సర్పంచ్‌లు గుగులోతు వాలునాయక్, బానోతు మహేందర్, బాలు నాయక్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్, గుగులోతు జుమ్మిలాల్, సంపతి శ్రీపాల్ పాల్గొన్నారు. అనంతరం తొర్రూరు మండలం పెద్ద వంగరలో శ్రీతులసి మండల సమాఖ్య ఏడో వార్షిక మహాసభకు మంత్రి హాజరయ్యారు. సెప్టెంబర్ 8న తొర్రూరులో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.