వరంగల్: పేషెంట్ పై ఎలుకలు దాడి చేయడం తమ నిర్లక్షమేనని, ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ లో ఓ పేషెంట్ పై ఎలుకలు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర సర్కారు సీరియస్ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంజీఎం సూపరింటెండెంట్ ను బదిలీ చేయగా.. ఇద్దరి డాక్టర్లను సస్పెండ్ చేసింది.
ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి.. ఎలుకలు దాడి చేసిన వ్యక్తిని పరామర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గోపి, డీఎమ్ఏ రమేశ్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ఎంజీఎం ఎలుకల దాడి ఘటన దురదృష్టకరమన్నారు. ఇకపై హాస్పిటల్స్ పై గట్టి నిఘా పెట్టినట్లు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. విధుల పట్ల అలక్ష్యం వహించే వాళ్ళని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎలుకల దాడిలో గాయపడ్డ శ్రీనివాస్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏజిల్ శానిటేషన్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు వెల్లడించారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించామని, పేషెంట్లు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. పేద ప్రజల సేవలో ఎంజీఎం హాస్పిటల్ కు మంచి పేరుందని, దాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేషెంట్లు ధైర్యంగా ఎంజీఎంకు రావొచ్చన్నారు.