హన్మకొండ: ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో వినాయక నిమజ్జనం, జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనాలకు సంబంధించి నిర్వాహకులు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దారి మళ్లింపులు, నిమజ్జన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాల గురించి ప్రజలకు మందే చెప్పాలన్నారు.
అలాగే ఈ నెల 16,17,18 తేదీల్లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. వరంగల్ మహానగరం ప్రశాంతతకు మారుపేరన్న మంత్రి ఎర్రబెల్లి... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎమ్సీ కమిషనర్ ప్రావీణ్య, సీపీ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.