
తొర్రూరు (పెద్దవంగర), వెలుగు : సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ నెమరుగొమ్ముల సుధాకర్‌రావు, ఎన్‌ఆర్‌ఐ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డితో కలిసి శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడారు. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని, గత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
కొన్ని పార్టీల లీడర్లు ఎన్నికల టైంలోనే వస్తూ అమలు కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాలు మరింత అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. అంతకుముందు ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, నాయకులు రామచంద్రయ్యశర్మ, గోపాల్‌రావు, సోమేశ్వర్‌రావు, శ్రీరాం సంజయ్‌కుమార్, ముత్తినేని శ్రీనివాస్, శ్రీరాం సుధీర్ పాల్గొన్నారు.