సైనికుల ఉసురు తీయడానికే అగ్నిపథ్

  • యువకులు చచ్చిపోతుంటే... నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా?
  • యువత శాంతియుతంగా పోరాడాలి
  • తక్షణమే అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలె
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్: రైతుల ఉసురు తీసింది సరిపోలేదని... ఇప్పుడు సైనికుల వెంట పడతున్నారా అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మోడీపై విరుచుకుపడ్డారు. అగ్నిపథ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ...  జై జవాన్, జై కిసాన్ అనేది భారత దేశ నినాదమని, కానీ నల్ల చట్టాలతో రైతులు, అగ్నిపథ్ తో సైనికులను బలి తీసుకునేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సైనికుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ... ఇప్పుడు అదే సైనిలకుల ప్రాణాలను రిస్క్ లో పెట్టారన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో  మూర్ఖపు ప్రభుత్వం నడుస్తోందన్నారు. అగ్నిపథ్ పనికిమాలిన స్కీం అని, దాని వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందన్నారు. అగ్నిపథ్ చాలా మంచి పథకమని బీజేపీ నాయకులు చెబుతున్నారన్న మంత్రి... దమ్ముంటే ముందు తమ పిల్లలను ఆర్మీలో చేర్పించాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. 

ఆర్మీ ఉద్యోగాల కోసం  కొన్ని నెలలుగా ఎంతో మంది అభ్యర్థులు సమాయత్తమవుతున్న తరుణంలో... నాలుగేళ్లే ఉద్యోగం అంటూ మోడీ ప్రభుత్వం యువత ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. నాలుగేళ్ల తర్వాత తమ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటామంటూ బీజేపీ నాయకులు సైనికులను కించపరిచేలా మాట్లాడటం విచారకరమన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప... బీజేపీకి అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోంటే... పీఎం మోడీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఓ వైపు యువత చనిపోతుంటే ... అగ్నిపథ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని, అలాగే ఆందోళన చేసిన అభ్యర్థులపై కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. యువత ఎట్టిపరిస్థితుల్లో సంయమనం కోల్పోవద్దని, శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాకేశ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.