- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
జనగామ అర్బన్/మహబూబాబాద్, వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. వర్షాల వల్ల వచ్చిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు రోడ్ల లోలెవల్ వంతెనలను ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.
మహబూబాబాద్‌లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్
భారీ వర్షాల పట్ల ప్రజలు, ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. బుధవారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖల ఆఫీసర్లు, సిబ్బంది
అందుబాటులో ఉండి, ప్రజలకు ఎలాంటి నష్టం కలుగకుండా చూడాలని సూచించారు. ఆమెతో పాటు కలెక్టర్ శశాంక ,ఎస్పీ శరత్ చంద్ర పవార్ , ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు,మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.