కాళోజీ స్ఫూర్తితోనే రాజకీయంగా ఎదిగా

హన్మకొండ: తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక కాళోజీ నారాయణ రావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. శుక్రవారం కాళోజీ 108వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని అన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాళోజీ తన గళాన్ని వినిపించారని చెప్పారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 25 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన భరతమాత ముద్దు బిడ్డ కాళోజీ నారాయణ రావు అని అన్నారు. కాళోజీ అందించిన స్ఫూర్తితోనే తాను రాజకీయంగా ఎదిగానని మంత్రి చెప్పుకొచ్చారు. కాళోజీ జన్మదినాన్ని సీఎం కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర  ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా గౌరవిస్తోందన్న మంత్రి దయాకర్ రావు.. ప్రతి ఏటా ప్రముఖ కవులను గుర్తించి కాళోజీ అవార్డులతో గౌరవిస్తున్నామని చెప్పారు. అలాగే వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. 

సీఎం కెసీఆర్ వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీ కి కాళోజీ పేరు పెట్టారు. ప్రస్తుతం హన్మకొండలో కాళోజీ కళా క్షేత్ర నిర్మాణం చేపట్టామని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్‌, ఎమ్మెల్యే  సతీష్ బాబు, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కుడా చైర్మన్ సుందర్ రాజ్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌ జిల్లాల క‌లెక్టర్లు గోపి, రాజీవ్‌గాంధీ హ‌న్మంతు, కాళోజీ శిష్యులు, ఉద్యోగ సంఘాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.