
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్, వెలుగు: హనుమకొండ వెయ్యి స్తంభాల ఆలయ రిపేర్లు స్పీడప్ చేయాలని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వర్క్స్ కంప్లీట్ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‍శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‍లో టూరిజం సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, కుడా ఆఫీసర్లతో.. వెయ్యి స్తంభాల గుడి, ఫోర్ట్ వరంగల్, జైన్ మందిరం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్‍రావు మాట్లాడుతూ.. వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపం, ఇతర మైనర్ రిపేర్లు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‍రావు ఇచ్చిన రూ.కోటి ఫండ్స్ కాకుండా అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చాలని ఆదేశించారు. కుడా ల్యాండ్ పూలింగ్అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఆర్కియాలజీ అనుమతులు ఆలస్యంగా రావడం, సాండ్ టెక్నాలజీతో ఆలయ నిర్మాణం ఉండడం వల్లే పనులు లేట్ అవుతున్నాయన్నారు. గడువులోగా నిర్మాణం పూర్తవనున్నట్లు చెప్పారు.
3వేల మందికి టెక్స్ టైల్ పార్కులో ఉపాధి
ఉమ్మడి వరంగల్ నుంచి మొదట పాలకుర్తి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా 3 వేల మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించి, తద్వారా వరంగల్ టెక్స్ టైల్ పార్కులో ఉపాధి కల్పించనున్నట్లు.. మంత్రి ఎర్రబెల్లి దయకర్‍రావు అన్నారు. కంపెనీలకు మ్యాన్ పవర్ లేకుంటే ఇతర ప్రాంతాలవారికి అవకాశాలు వెళతాయన్నారు. మనోళ్లకు ఉపాధి దక్కకుంటే టెక్స్ టైల్‌పార్క్ లక్ష్యం దెబ్బతింటుందన్నారు. అందుకే డ్వాక్రా మహిళలకు ఈ రంగంలో 30 రోజుల పాటు కుట్టు శిక్షణ ఇప్పించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఒంటరి మహిళలు, అనాథలు, వితంతులు, దివ్యాంగులతో పాటు ఇతర మహిళలకు అవకాశం ఇస్తామన్నారు.
కోర్టులో ఉన్న జాగలో అక్రమ నిర్మాణం!
టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త నిర్వాకం
హనుమకొండ, వెలుగు:హనుమకొండ న్యూరాయపురలో ఉండే కర్నె భారతలక్ష్మి పేరు మీద వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటలో సర్వే నెంబర్689/1, 690/1 లలో 318.88 గజాల భూమి ఉంది. ఇది వరకే ఈ భూమి విషయంలో వివాదాలు తలెత్తడంతో కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఆ భూమికి డిమాండ్ పెరిగిపోవడంతో అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఆ ల్యాండ్ పై కన్నేశాడు. వెంటనే ఆ ల్యాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్నిర్మించాడు. తనకున్న అధికార బలం, ఓ ప్రజాప్రతినిధి అండతో మున్సిపల్ఆఫీస్ నుంచి ఇంటి నెంబర్ కూడా తీసుకున్నాడు. అనంతరం ఓ రేకుల షెడ్డు కూడా నిర్మించాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కోర్టులో కేసు ఉన్న ల్యాండ్ కు ఇంటి నెంబర్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ల్యాండ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, కోర్టు వివాదానికి సంబంధించిన పేపర్లతో భారతలక్ష్మి కుమారుడు కర్నె సాయిప్రసాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జీడబ్ల్యూఎంసీ ఆఫీస్‌లోనూ వినతిపత్రం సమర్పించారు.
నిట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా
కాజీపేట, వెలుగు: వరంగల్ నిట్ లో 60మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగిస్తూ కాంట్రాక్టర్ తీసుకున్న నిర్ణయంపై కార్మికులు మండిపడ్డారు. బుధవారం డ్యూటీలు బహిష్కరించి, నిట్ మెయిన్‌గేట్ ముందు నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశారు. దాదాపు 230 మంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏండ్లుగా నిట్‌లో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నామని, కాంట్రాక్టర్లు మారినా తాము విధుల్లోనే ఉంటున్నామని చెప్పారు. ఇటీవల కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్.. 60 మంది కార్మికులను తీసేశారని మండిపడ్డారు. కరోనా తర్వాత విద్యార్థుల రాకతో పనిభారం పెరిగిందని, అదనంగా కార్మికులను నియమించుకోవాల్సింది పోయి తొలగించడం ఏంటని ప్రశ్నించారు.
అవినీతి జరగలే.. అంతా ఓకే
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవినీతి జరగలేదని, అంతా సవ్యంగానే ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని, నిధుల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు.
బుకాయించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు..
మీడియా సమావేశంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ల బుకాయింపు కనిపించింది. అవినీతి లేకుంటే ప్రతిపక్షాలతో కలిసి ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించగా.. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే అక్కడికి వెళ్లామని చెప్పారు. కాగా, రెండ్రోజుల కింద అవినీతి జరిగిందని చెప్పిన అధికార పార్టీ కౌన్సిలర్లు ఈ మీటింగ్‌లో కనబడలేదు.
‘ఇది విడ్డూరం’
మున్సిపాలిటీ అవినీతిపై ధర్నా చేసిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు.. మునుగోడు ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే మాట మార్చడం విడ్డూరమని కాంగ్రెస్ కౌన్సిలర్ సమ్మెట సుధీర్ ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ కౌన్సిలర్లు పిలిస్తేనే తాము ధర్నాకు వెళ్లామన్నారు. అవినీతి జరగనప్పుడు వినతిపత్రంపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎందుకు సంతకాలు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
లైబ్రరీల్లో కాంపిటీటివ్ బుక్స్ పెట్టాలి
ములుగు, వెలుగు: ములుగు జిల్లాలోని లైబ్రరీల్లో విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడే కాంపిటీటివ్ బుక్స్ అందుబాటులో ఉంచాలని డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ సూచించారు. బుధవారం తన ఆఫీసులో లైబ్రేరియన్లతో మీటింగ్ నిర్వహించారు. అద్దె విధానంలో కొనసాగుతున్న లైబ్రరీల వివరాలు అందజేయాలన్నారు. స్కూళ్లలోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ల నేపథ్యంలో అవసరమైన మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలను పునర్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పటాకుల షాప్‌లకు పర్మిషన్ తప్పనిసరి
జనగామ అర్బన్, వెలుగు: దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే పటాకుల షాప్‌లకు పర్మిషన్ తప్పనిసరి అని వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం వెల్లడించారు. బుధవారం జనగామలోని తన ఆఫీసులో వ్యాపారులతో మీటింగ్ నిర్వహించారు. పబ్లిక్ ప్లేస్ లలో షాపులు నిర్వహించాలంటే మున్సిపల్ ఆఫీసు నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ షాప్ అయితే ఓనర్ పర్మిషన్ సర్టిఫికెట్, ఫైర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. పర్మిషన్ పొందాలంటే ఎస్బీఐలో రూ.800 చలాన్ కట్టి, దరఖాస్తు పూర్తిచేసి పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని సూచించారు. టెంపరరీ షాప్‌లకు ఈ నెల 20 నుంచి 27 వరకు పర్మిషన్ ఉంటుందని స్పష్టం చేశారు. షాపుల ముందు టెంట్ వేసి పటాకులు విక్రయించరాదన్నారు. పోలీస్ క్లియరెన్స్ లేని షాపులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మీటింగ్‌లో జనగామ ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, జనగామ ఫైర్ ఆఫీసర్ మధుకర్ ఉన్నారు.
మరిపెడ పీహెచ్‌సీకి రిపేర్లు చేస్తాం
మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలకేంద్రంలోని పీహెచ్‌సీకి త్వరలోనే రిపేర్లు చేపడతామని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ హామీ ఇచ్చారు. బుధవారం డీఎంహెచ్ వో హరీశ్‌రాజ్ తో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. హాస్పిటల్ రిపేర్లకు రూ.5లక్షలు వెచ్చిస్తామన్నారు. గతంలోనే 108 వాహనాన్ని మంజూరు చేశామని గుర్తు చేశారు. అనంతరం బీపీ, షుగర్, క్యాన్సర్ పేషెంట్లకు ఎన్సీడీ కిట్లు పంపిణీ చేశారు. మరిపెడ ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద తదితరులున్నారు.
కేటీపీపీ ముట్టడి ఉద్రిక్తం
బాధితులను అడ్డుకున్న పోలీసులు
రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బుధవారం ఉదయం దుబ్బపల్లి గ్రామస్తులు కంపెనీని ముట్టడించారు. తమ గ్రామానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చిట్యాల సీఐ పులి వెంకట్, ఎస్సై అభినవ్ పోలీస్ వాహనాల ద్వారా అక్కడి నుంచి బాధితులను తరలించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కేటీపీపీ విజిట్ కు వచ్చిన సీఎండీ ప్రభాకర్‌రావును గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలిసిందే. వారితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎండీ, హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో బాధితులు మండిపడ్డారు.
గుండెపోటుతో తహసీల్దార్ మృతి
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల తహసీల్దార్ కొల్లూరి కిషోర్ కుమార్ గుండె పోటుతో మృతి చెందారు. రెండ్రోజుల కింద అనారోగ్యంబారిన పడిన ఆయన.. వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆఫీసు సిబ్బంది తహసీల్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు.
జంతువుల వేటకు కరెంట్ వైర్లు!
వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ లో జంతువుల వేటకు కొందరు కరెంట్ వైర్లు బిగిస్తున్నారు. బుధవారం వీటిని తాకిన ఓ రైతుకు కరెంట్ షాక్ కొట్టడంతో చేతికి తీవ్ర గాయమైంది. తృటిలో ప్రాణాలు దక్కాయి. లింగాపూర్ వెళ్లే దారిలోని ఓ పత్తి చేనులో కరెంట్ వైర్లు బిగించగా.. వీటిని తాకిన వడ్డేపల్లి రాజు అనే రైతుకు షాక్ కొట్టింది. కరెంట్ ఆఫీసర్లకు ఫోన్ చేసినా స్పందించకపోవడం గమనార్హం.
ప్రాణం తీసిన వాటర్ హీటర్
ఏటూరునాగారం, వెలుగు: వేడి నీళ్ల కోసం పెట్టిన వాటర్ హీటర్ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని మానసపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన జగజంపుల స్వామి, శిరీషా దంపతులకు కొడుకు నిఖిల్(5) ఉన్నాడు. తల్లిదండ్రులు సాయంత్రం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెట్టారు. అది గమనించని నిఖిల్ దాన్ని తాకాడు. దీంతో షాక్ కొట్టి స్పాట్లో చనిపోయాడు.