
వరంగల్, వెలుగు : ‘‘తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టాలని నాకు లేదు. కానీ, చంద్రబాబు తెలంగాణలో దుకాణం ఎత్తేసి అవుతల పడ్డడు.. మరి నేనేం జేయాలే.. కొట్టుకు సచ్చినా టీడీపీ ఇక్కడ లేత్తలేదు. ఉన్నోళ్లను కాపాడుకోవాల్నాయే.. అదే టైంలో కేసీఆర్ మంచిగా పనిచేస్తుండే. ఆయనకు సపోర్ట్ చేయాలని పార్టీ మారిన”అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు.
బుధవారం వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లే మనం ఎంతో అభివృద్ధి చెందామని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మోసం చేస్తే కన్నతల్లికి మోసం చేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేస్తున్నారా? ఇక్కడ చేస్తామంటే నమ్మాలా అని ఆయన ప్రశ్నించారు.