వరంగల్: సైక్లింగ్ తో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సైక్లోథాన్ – 2022 సైకిల్ పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, సీపీ తరుణ్ జోషిలతో కలిసి మంత్రి సైకిల్ తొక్కారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... సైక్లింగ్ అనేది మంచి అలవాటు అని, సైక్లింగ్ వల్ల చాలా లాభాలున్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు సైకిల్ ను విరివిగా వాడేవారని, ఇప్పటికీ చైనా లాంటి దేశాల్లో సైకిల్ వినియోగం విరివిగా ఉందని చెప్పారు. సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, పలువురు ప్రముఖులు, పోటీ పడుతున్న యువత పాల్గొన్నారు.