రూ.300 కోట్లతో రాష్ట్రమంతటా ఎల్ఈడీ లైట్లు

వరంగల్: రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 12,753 గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు వల్ల విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. వచ్చే 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న ఆయన... మొదటి విడతలో 9 వేల గ్రామాల్లో 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ వల్లే ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పిన ఆయన... అందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే నిదర్శనమని స్పష్టం చేశారు. 

అయితే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని, ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో పారిశుధ్య నిర్వహణ మెరగుపడి... అంటు వ్యాధుల నిర్మూలన జరుగుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు, సాగు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయని తెలిపారు. ప్రణాళికబద్దంగా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని వెల్లడించారు. ఎన్నో గొప్ప పథకాలతో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు.