
పాలకుర్తి (కొడకండ్ల), వెలుగు : మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు వల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్లలో ఏర్పాటు చేయనున్న మినీ టైక్స్‌టైల్ పార్కు కోసం అంబేద్కర్ కాలనీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని, రామవరం రోడ్డులోని స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఆయన మట్లాడుతూ మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు వల్ల చేనేత కార్మికులకే కాకుండా ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు. పార్కు ఏర్పాటు కోసం 20 ఎకరాలు అవసరం అవుతుందని, కానీ భవిష్యత్ అవసరాల కోసం ఎక్కువ స్థలాన్ని సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అంబేద్కర్ కాలనీకి ఎదురుగా ఉన్న 50 ఎకరాలు, రామవరం రోడ్డులోని 10 ఎకరాలతో పాటు మరో 18 ఎకరాలు కూడా టెక్స్‌టైల్ పార్క్‌కు అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కృ-ష్ణవేణి ఉన్నారు. అక్కడి నుంచి గిర్నితండాకు వెళ్లిన మంత్రి ఇటీవల చనిపోయిన మెడికో ప్రీతి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తాను సొంతంగా ఇస్తానన్న రూ. 20 లక్షలను ప్రీతి ఫ్యామిలీ మెంబర్స్‌కు అందజేశారు. అలాగే హన్మకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో సూసైడ్ చేసుకున్న, కొడకండ్ల మండలం ఏడునూతులకు చెందిన ఇంటర్ స్టూడెంట్ మురారిశెట్టి నాగజ్యోతి ఫ్యామిలీని పరామర్శించారు.
పాలకుర్తిని ఫస్ట్ ప్లేస్‌లో నిలుపుతాం
తొర్రూరు, వెలుగు : గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో బెస్ట్‌గా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్ శా ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. తొర్రూ రు మండలం అమర్‌సింగ్ తండా, జీకే తండాలో గ్రామపంచాయతీ బిల్డింగ్, చౌకధరల డిపోలను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. చీకటాయపాలెం నుంచి అమర్‌సింగ్ తండా మీదుగా హరిపిరాల వరకు డబుల్ రోడ్డు నిర్మాణంతో పా టు, అమర్‌సింగ్ తండా వద్ద 25 డబుల్ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో యువతులకు టైలరింగ్ ట్రైనింగ్‌తో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సోమారంలో శివాలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రమేశ్, జడ్పీటీసీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్‌రావు, వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు.