- దేశాన్ని కేసీఆర్ ఊపు ఊపడం ఖాయం : ఎర్రబెల్లి
నిజామాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టడం, ఓ ఊపు ఊపడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. నిజామాబాద్‌లో ఆయన టీఆర్ఎస్ ఆఫీసును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాక.. మోడీ సంగతి చూస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో చర్చిస్తున్నారని, కేసీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సిందేనని అన్నారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోవాలని చూడటం మంచిది కాదని హితవు పలికారు.
తాము గవర్నర్ వ్యవస్థను కించపరచడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తిని అవమానపరిచేలా వ్యవహారిస్తే.. గతంలో ఎన్టీఆర్‌ను అవమానపరిచినప్పుడు ప్రజలు ఎలా తిరగబడ్డారో అలాగే తిరగబడతారని పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తొండి సంజయ్‌లా మారారని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఓ దద్దమ్మ అని, బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తేవడం చేతకాని ఎంపీ అని విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రానికి లేఖలు రాసి.. ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. లక్ష్మణ్ మీద ప్రేమతో రాజ్యసభ పదవి ఇవ్వలేదని, కేసీఆర్ దేశ రాజకీయాల్లో బలపడుతున్నారని భయపడి ఆయనకు పదవి ఇచ్చారన్నారు.