మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు (పెద్దవంగర), వెలుగు : మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం బాగుపడుందని, అందుకే మహిళల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ శిబిరాన్ని బుధవారం పరిశీలించారు. ట్రైనింగ్ ఎలా జరుగుతుందో మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల్లో పొదుపు, ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉంటుందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ మహిళా సాధికారితపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి కింద మహిళలకు పావలా వడ్డీ, బ్యాంక్ లింకేజీ లోన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన ఉచిత కుట్టు శిక్షణ, మిషన్ల పంపిణీ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందన్నారు. టైలరింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను సందర్శించారు. ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం పార్టీ ఆఫీస్‌లో మండల ముఖ్య నేతలతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించారు. డెవలప్‌మెంట్ వర్క్స్‌ను స్పీడ్‌గా పూర్తి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ఐలయ్య, రామచంద్రయ్య శర్మ, శ్రీరాం సంజయ్, రవీందర్‌నాయక్, వెంకట్రామయ్య, లింగమూర్తి, రవి పాల్గొన్నారు.