మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టలేదన్నారు. ‘మోటర్లకు మీటర్లు పెట్టం’ అంటూ ప్రధాని మోడీతో రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. చండూరులో ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో కొత్తగా ఏం అభివృద్ధి చేశారు..? కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మొన్నటి వరకూ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పాలన్నారు. ‘నేను ప్రతిపక్షంలో 15 ఏళ్లు పని చేశాను. నా నియోజకవర్గం(పాలకుర్తి) సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి పరిష్కరించాను’ అని కామెంట్స్ చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో ఈనెల 30వ తేదీలోపు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. మేము ఎమ్మెల్యేలుగా గెలిచి..మంత్రులుగా ఉన్నాం కాబట్టి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నామని చెప్పారు. రాష్ట్రానికి, మునుగోడుకు సంబంధం లేని బీజేపీ నాయకులు ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అన్ని గ్రామాల్లోనూ ప్రజలే గుర్తు చేస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు.