వరంగల్, వెలుగు : ‘వరంగల్‌లో నాలాల మీద, చెరువు శిఖాల్లో ఇండ్లు కట్టారు, ఏవీ తొలగించే పరిస్థితి లేదు, కొందరు నకిలీ పేపర్స్ సృష్టించారు, తీసేస్తే మళ్లీ లొల్లి, ఏం చేస్తాం’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం హనుమకొండలో పర్యటించి మాట్లాడారు. వరంగల్, హనుమకొండ పరిధిలో నాలాలు, చెరువు శిఖం భూముల్లో వందల కొద్దీ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. భద్రకాళి చెరువు శిఖంలోనే వెయ్యి ఇండ్లు ఉన్నాయన్నారు. పేపర్స్ సృష్టించుకుని 30 ఏండ్ల నుంచి ఉంటుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేశించి వరంగల్ నగరాన్ని కాపాడేలా చూస్తామని మంత్రి చెప్పారు.
వరద నివారణ చర్యల వల్లే సమస్య తగ్గింది
హనుమకొండ, వెలుగు : భారీ వర్షాలతోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అపార నష్టం జరిగిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. వరద నివారణ చర్యలు చేపట్టడం వల్లే చాలా వరకు సమస్య తగ్గిందని, పురోగతిలో ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వరంగల్ నగరంలో ముంపునకు గురైన పరిమళకాలనీ, జవహర్ కాలనీలను శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మామునూరు హెలీప్యాడ్ నుంచి ఏటూరునాగారం కొండాయి, భద్రాచలం ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు, నీరు, మందుల పంపిణీని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పునరావాస చర్యలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సీఎస్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారన్నారు. అతి భారీ వర్షాల వల్లే ఈ అనర్థాలు వచ్చాయన్నారు. ప్రజలు మరో రెండు రోజులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. వరదలు పూర్తి స్థాయిలో తగ్గే వరకు ఆఫీసర్లు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ప్రజాప్రతినిధులు
మరిపెడ/నర్సింహులపేట/ములుగు/మొగుళ్లపల్లి/కాశీబుగ్గ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లిలో ఆకేరు వాగు ఉధృతికి దెబ్బతిన్న రోడ్లను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరిశీలించి రిపేర్లకు ఎస్టిమేషన్ పంపాలని సూచించారు. మరిపెడ మండలం పురుషోత్తమాయిగూడెం బ్రిడ్జి వద్ద ఉధృతిని శుక్రవారం మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత పరిశీలించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలోని బ్రిడ్జిని శుక్రవారం జడ్పీచైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ పరిశీలించారు.
ఏటూరు నాగారం, పస్రా రోడ్డును త్వరగా పునరుద్ధరించి రాకపోకలను క్లియర్ చేయాలని డీఈ రఘువీర్‌కు సూచించారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో దెబ్బతిన్న రోడ్లు, నష్టపోయిన పంటలను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. వర్షం వల్ల జరిగిన నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్‌లో జలమయమైన రాజీవ్‌నగర్, బీఆర్ నగర్‌లోని పలు ప్రాంతాలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షరాలు ఎర్రబెల్లి స్వర్ణ, బీజేపీ నాయకుడు కుసుమ సతీశ్‌కుమార్, సీపీఐ నాయకుడు మేకల రవి పరిశీలించారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు మంచి నీళ్లు, ఫుడ్ ప్యాకెట్స్ అందజేయగా, రాజనాల శ్రీహరి ట్రంకు పెట్టలు అందజేశారు.
విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు
హనుమకొండ, వెలుగు : భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడంలో సహకరించాలని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వ చీఫ్ విప్దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు. వరంగల్ వెస్ట్నియోజకవర్గంలోని 9,10,11,29 డివిజన్ల పరిధిలోని కాకతీయ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, అలంకార్, పెద్దమ్మగడ్డ, రామన్నపేట, రంగంపేట ముంపు ప్రాంతాల్లో కుడా చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్‌రిజ్వాన్ బాషాతో కలిసి పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో అవసరమైన చోట ప్రొటెక్షన్ వాల్వ్స్, నాలాల పూడికతీత పనులు చేపట్టడంతో పాటు, నాలాలపై నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. నగరం ముంపు బారిన పడకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
వరదలను బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు
పరకాల, వెలుగు : ‘భారీ వర్షం దేవుడు ఇచ్చిన విపత్తు, వరదలను బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు, దీనిని రాజకీయం చేయడం కాదు, చేతనైతే ప్రజలకు సహకరించాలి’ అని హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. పరకాల, నడికూడ మండలాల్లో తెగిన చెరువు కట్టలు, ఉప్పొంగిన వాగులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. నష్టం వివరాలను ఆఫీసర్లు సేకరించి ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. అంతకుముందు నడికూడ మండలం కంఠాత్మకూరు మాటు ఉధృతికి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉందని ప్రజలు, ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని పిలుపునిచ్చారు.