వరంగ‌ల్ ని అద్దంలా మారుస్తాం.. మ‌హ‌న‌గ‌రంలా అభివృద్ధి చేస్తాం

వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్ త‌ర‌హాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ప‌నికి సీఎం కెసీఆర్, పుర‌పాల‌క మంత్రి కేటీఆర్ గారు కంక‌ణ బ‌ద్ధులై ఉన్నార‌న్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆదివారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త‌న‌ చేతుల మీదుగా క్యాంపు కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేయ‌డం ఆనందంగా ఉందన్నారు. నిర్ణీత స‌మ‌యంలో ఈ క్యాంపు కార్యాల‌యాన్ని పూర్తి చేసేలా అధికారులు వేగంగా ప‌నులు పూర్తి చేయాలన్నారు. ఉమ్మ‌డి జిల్లాలో తాను శంకుస్థాప‌న , ప్రారంభోత్స‌వాలు చేసిన క్యాంపు కార్యాల‌యాల‌ ఎమ్మెల్యేలంతా తిరిగి గెలిచారని , ఈ సెంటుమెంటు తెలిసే … తూర్పు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ త‌న చేత క్యాంపు కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేయించారన్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని అణువు అణువు నాకు తెలుసని, వ‌రంగ‌ల్ ని అద్దంలా అభివృద్ధి చేసే బాధ్య‌త త‌న‌ద‌ని అన్నారు.

వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్ న‌గ‌రంలా సీఎం మారుస్తార‌ని, ఇప్ప‌‌టికే అనేక ర‌కాల అభివృద్ధి ప‌నులు, నిధులు సీఎం వ‌రంగ‌ల్ కు ఇచ్చార‌న్నారు. మొన్న‌టి వ‌ర్షాల బారిన ముంపున‌కు గురైన ప్రాంతాల పున‌రావాసానికి, ఇత‌ర అభివృద్ధి ప‌నులకు వెంట‌నే నిధులు కేటాయించిన ఘ‌నత‌ సీఎం కెసిఆర్ ది అని అన్నారు.

వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ పై ఇప్ప‌టికే ఒక స‌ర్వే నిర్వ‌హించాం.. ఆ స‌ర్వేలో వార్ వ‌న్ సైడ్ లా వ‌రంగ‌ల్ మొత్తం వ‌న్ మ‌న సైడే ఉందన్నారు ఎర్ర‌బెల్లి. ఎమ్మెల్యేలు, మేయ‌ర్ కూడా చైర్మ‌న్, కార్పొరేట‌ర్లు, వ‌రంగ‌ల్ అభివృద్ధి పైనే దృష్టి సారించాల‌న్నారు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ప‌క్షానే ఉన్నారని,
ప్ర‌జ‌లెప్పుడూ అభివృద్ధి ప‌క్షానే ఉంటార‌న్నారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలిసి, అభివృద్ధి చేస్తున్న సీఎం, మంత్రి మ‌న‌కుండ‌టం మ‌న అదృష్టమ‌ని మంత్రి అన్నారు.