20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారంటీ: ఎర్రబెల్లి

 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా  దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..తాను సొంతంగా సర్వే చేయించానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని.. అయితే 20 మంది సిట్టింగ్ లను మారిస్తే 100 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు.  ఆరేడు జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు.. మూడు నాలుగు జిల్లాలలో బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్యే పోటీ ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు  కోట్లాడేది 10 సీట్ల కోసమేనని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్ కే పడతాయని తెలిపారు. తన సర్వేలు ఎప్పుడూ అబద్ధం కాలేదని చెప్పారు. 

అయితే సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని ఇప్పటికే  సీఎం కేసీఆర్  ప్రకటించారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని దయాకర్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.