వరంగల్ అర్బన్: హన్మకొండలోని ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో స్త్రీనిధి పరపతి సమైక్య ఆధ్వర్యంలో వరంగల్ రూరల్ మహబూబాద్ మరియు జనగాంలకు సంబందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, హరిత, డిఎం అండ్ హెచ్ఓ లలితా దేవి, సీపీ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. వచ్చే రెండు రోజుల్లో సీఎం కేసీఆర్.. ఎంజీఎం ఆస్పత్రిని సందర్శిస్తారని ఆయన అన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రేపు లేదా ఎల్లుండి ఎంజీఎం హాస్పిటల్‌ను సీఎం కేసీఆర్ విజిట్ చేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. వ్యాక్సిన్ కొరతను తీర్చడానికే గ్లోబల్ టెండర్లు పిలిచాం. ప్రభుత్వ ఆస్పత్రులకు స్త్రీనిధి ద్వారా 50 లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశాం. ప్రధానికి గుజరాత్ తప్ప.. ఏ రాష్ట్రం కనిపించడంలేదు. కేంద్రం సహకరించకున్నా.. రాష్ట్రంలో ప్రజారోగ్యం బేషుగ్గా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల పరిశీలనపై సీఎం కేసీఆర్‌ది సాహసోపేత నిర్ణయం. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మందులు, ఆక్సిజన్ సరఫరాలకు ఇబ్బందులు లేవు. ఎంజీఎం ఆస్పత్రికి మరో 275 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు వచ్చాయి. సెంట్రల్ జైలును ఇప్పడున్న స్థలం నుంచి తరలించి.. ఆ స్థలంలో ఎంజీఎం ఆస్పత్రిని నిర్మిస్తాం’ అని ఆయన అన్నారు.