
తొర్రూరు, వెలుగు : కార్యకర్తల కష్టాసుఖాల్లో తోడుంటానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. తన గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన ముఖ్య కార్యకర్తలు, నాయకుల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. తొర్రూరును డివిజన్ కేంద్రం చేయడంతో పాటు, రూ. 150 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశామని చెప్పారు.
ఏమైనా అభిప్రాయభేదాలు ఉంటే పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో ఎంపీపీ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, నాయకులు కాకిరాల హరిప్రసాద్‌రావు, సోమేశ్వర్‌రావు, కిశోర్‌రెడ్డి పాల్గొన్నారు.