
తొర్రూరు, వెలుగు : కాంగ్రెస్ లీడర్ల మాటలు ప్రజలు నమ్మొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వారు డబ్బు సంచులతో వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి, ప్రజలకు మొండి చేయి చూపుతారని ఎద్దేవా చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి మరోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన రియల్టర్ బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన యాదవ సింహ గర్జన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
కాంగ్రెస్ పాలన వల్లే ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్, కేసీఆర్ కిట్లను అందజేశారా అని ప్రశ్నించారు. అనంతరం తొర్రూరులోని అయ్యప్ప గుడికి రాజేందర్ యాదవ్ విరాళంగా ఇచ్చిన భూమిని మంత్రి ఆలయ ట్రస్ట్‌కు అందజేశారు. అలాగే అయ్యప్పగుడికి, గంగమ్మ గుడికి మంత్రి రూ. 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అనంతరం తొర్రూరులో 33 మంది ఎస్సీ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక పాలకేంద్రం నుంచి ఎల్‌వైఆర్ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే తొర్రూరు మండలం వెంకటాపురంలో జీపీ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌లా పనిచేసే మరో వ్యక్తిని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. తర్వాత తొర్రూరులో నిర్వహించనున్న మంత్రి కేటీఆర్ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్‌రావు, కిశోర్‌రెడ్డి, బిందు శ్రీను, సర్పంచ్ శీలం లింగన్న, కర్నె నాగరాజు, రేవతి శంకర్, మణిరాజ్ పాల్గొన్నారు.