- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, వెలుగు : నిరంతర విద్యుత్ కావాలో.. కరెంట్ కోసం బావుల వద్ద ఎదురుచూపులు కావాలో రైతులే తేల్చుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని గిర్నితండా, మైదం చెరువు తండా, చెరువు ముందు తండా, నీలిబండ తండా, బొడోని కుంటతండా, రామేశ్వరం, కడగుట్ట తండా, హక్యాతండాల్లో శుక్రవారం ఆయన పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డ తండాలు ఇప్పుడు అభివృద్ధి బాట పడుతున్నాయన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు. ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుహాసిని, ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.