మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిరసన సెగ

ఎల్కతుర్తి, వెలుగు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నిరసన సెగ తగిలింది. ఆయన బుధవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​తో కలిసి మండలంలోని కేశవపూర్, దండేపల్లి, కోతులనడుమ, దామెర గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. అభివృద్ధి పనులపై ప్రశ్నించారు. గుంటూరుపల్లి గ్రామస్తులు మంత్రి కాన్వాయ్​ని అడ్డుకొని రోడ్లు బాగు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి.. ‘‘గుంటూరుపల్లిలో ఎన్ని ఓట్లు ఉన్నయ్? యూనిటీగా ఉంటారా? కమ్మలు మాట ఇస్తే తప్పరు’ అని అన్నారు.

దీంతో ఓట్లు ఉంటేనే అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా? అని పలువురు మంత్రిని ప్రశ్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దండేపల్లిలో సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి జనం రాగా పోలీసులు వాళ్లను కట్టడి చేశారు. దళితబంధు, పింఛన్లు, అభివృద్ధి పనులకు నిధులివ్వాలని వినతిపత్రాలు ఇస్తుండగా అడ్డుకున్నారు. తిమ్మాపూర్‌‌లో మంత్రి కాన్వాయ్ ని ఎంపీటీసీ ఇంద్రసేనారెడ్డి, గ్రామస్తులు అడ్డుకున్నారు. తిమ్మాపూర్ నుంచి -సీతంపేటకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని ఆందోళనకు దిగారు. మంత్రి కాన్వాయ్ ఆపి గ్రామస్తులతో మాట్లాడారు. 15 రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.