డబుల్ ఇంజన్ సర్కారుతో చిచ్చు

డబుల్ ఇంజన్ సర్కారుతో చిచ్చు
  • దేశాన్ని చీకట్లోకి నెడుతున్న మోడీ సర్కార్
  • అధికారం అప్పగిస్తే దేశాన్ని ప్రమాదంలో పడేశారు
  • వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా అసత్యాల ప్రచారం
  • గుజరాత్ నమూనాతో బీజేపీ నయా వంచన

హైదరాబాద్: డబుల్ ఇంజన్ సర్కారు పేరుతో కేంద్రం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందని, నవజాత శిశువు లాంటి రాష్ట్ర గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన వై. సతీష్ రెడ్డి శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లోని రెడ్కో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే, బీజేపీ పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని విమర్శించారు. వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా బీజేపీ అసత్యప్రచారాలకు దిగుతోందని, అటువంటి అసత్యాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గుజరాత్ నమూనాను చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ... అదే గుజరాత్ ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందన్నారు.

వ్యవసాయానికి ఆరు గంటలు కూడ కరెంట్ ఇవ్వకపోగా...  పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన అంశాన్ని మంత్రులు గుర్తుచేశారు. యావత్ భారతదేశంలో చీకట్లు అలుముకున్న రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వెలుగులు నింపిందన్నారు. అటువంటి  నాయకుడి నేతృత్వంలో జరిగిన తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. రెడ్కో చైర్మన్ గా సతీష్ రెడ్డి నియామకం అందులో భాగంగా జరిగిందేనన్నారు. కరెంటు, సాగు, తాగు నీరు కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు చేపట్టరన్నారు. పల్లె, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ఆలోచన దేశంలో ఎవరూ చేయలేదని,  కుల వృత్తుల కు ప్రోత్సాహం సీఎం కెసిఆర్ తప్ప ఎవరూ ఇవ్వలేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే కేంద్రం పనిగా మారిందన్నారు.