ప్రధాని మోడీకి ఎర్రబెల్లి పోస్ట్ కార్డ్

హన్మకొండ: చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నెల 22న  చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్పందించిన మంత్రి ఎర్రబెల్లి మోడీకి పోస్ట్ కార్డు రాశారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంలోని చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇప్పటి వరకు అందుతున్న సబ్సిడీలు, పథకాలను ఎత్తేయడమే కాకుండా... చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని విధించడం దారుణమని విమర్శించారు.

చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన ఎర్రబెల్లి దయాకర్ రావు...  ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్పందించాలని, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు పోస్టు కార్డులపై పీఎం మోడీకి సందేశం పంపాలని కోరారు.