బండి పోతే బండి అంటివి.. ఏమైంది బండి సంజయ్?

వరంగల్ అర్బన్: వరంగల్ పట్టణం ఊహించని రీతిలో అభివృద్ధిలో ముందుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. వరంగల్‌లో మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం  కావలసిన తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఎర్రబెల్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకు వరంగల్ మంచి తీర్పు ఇస్తుందనే నమ్మకం మాకు ఉంది. ఇప్పటికే అభివృద్ధి చేసాం.. ఇక ముందు కూడా చేస్తాం. ఇంకో మూడు సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. ప్రతీ ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్‌ను ఆశీర్వదించారు. బండి సంజయ్ అవగాహన లేక మాట్లాడుతున్నాడు. తాగునీటి కోసం 950 కోట్లు ఖర్చు పెట్టాం. అభివృద్ధి కనపడట్లేదా? వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇతర రాష్ట్రాలకు ఇచ్చి.. మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్, వరంగల్‌కి కేంద్రం ఏం ఇచ్చింది? బండి పోతే బండి.. గుండు పోతే గుండు.. ఇలా అనేక హమీలు ఇస్తీవి.. ఏమైంది? బీజేపీ స్టేట్‌మెంట్లకేనా.. ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చెయ్యలేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు సీట్లను తామే గెలుస్తామని.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉండడు అని బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. ఆ స్టేట్‌మెంట్‌కి ఆయన సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని నాలుగో స్థానంలో ఉంచారు. మెడికల్ కాలేజీలు ఇవ్వమనీ విజ్ఞప్తి చేసాం.. ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎంపీగా సంజయ్ కరీంనగర్‌కు ఏం చెయ్యలేదు. నిజామాబాద్ పసుపు బోర్డు ఏమైంది? నాడు కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ తేస్తున్నాం.. ఇస్తున్నాం అని ప్రకటనలు చేశారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఇస్తామన్న హమీ ఏమైంది? బండి సంజయ్ మాటలు నమ్మేందుకు వరంగల్ ప్రజలు సిద్ధంగా లేరు. వరంగల్ రూపురేఖలు మార్చేందుకు మేము, మా సీఎం, కేటీఆర్ రెడిగా ఉన్నాం. హైదరాబాద్ ఎన్నికలలో మాయటలు చెప్పారు. అది గ్రహించిన ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ కూడా కోల్పోయేలా చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇచ్చాం.. ఇవ్వ లేదంటున్నారు. గిరిజన యూనివర్సిటీకి 600 ఎకరాల ఇచ్చాం. యూనివర్సిటీకి కేంద్రం లక్ష నలభై వేలు ఇచ్చింది. మాకు రావలసిన వాట కూడా సరిగా ఇవ్వట్లేదు. మాకొచ్చే వాటా మాకు ఇవ్వండి.. అది మా హక్కు. అదనంగా రూపాయి వద్దు’ అని మంత్రి డిమాండ్ చేశారు.