ఐదుగురు సభ్యులతో మండలానికో కమిటీ వేయండి
ములుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
ములుగు, వెలుగు: ‘కార్యకర్తలకు సమస్యలున్నయ్.. పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎంపీ కవిత సమక్షంలో మండలానికో ఐదుగురు సభ్యుల చొప్పున కమిటీ వేయండి. వారు చెప్పిందే మండలంలో జరగాలి. ఏ అధికారి మాట వినడో చెప్పండి. వినేలా చేసే బాధ్యత నేను, మంత్రి సత్యవతి రాథోడ్ చూసుకుంటాం’.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ములుగులోని లీలా గార్డెన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి దయాకర్ రావుతోపాటు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా మాట్లాడిన ఎమ్మెల్సీ, మండల ప్రతినిధులు అధికారులు తమ మాట వినడం లేదని, మంత్రులుగా తమ పనులు జరిగేలా చొరవ తీసుకోవాలని సభాముఖంగా అడిగారు. అందుకు మంత్రి దయాకర్ రావు స్పందిస్తూ మండలానికో కమిటీ వేయాలని, అందులో జడ్పీటీసీ, ఎంపీపీతోపాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మరో ఇద్దరు సీనియర్ నాయకులు ఉండాలన్నారు. ఆ మండలంలో ఈ కమిటీ చెప్పిందే జరగాలని, వారు చెప్పిన పని అధికారులు చేయాల్సిందేనన్నారు. లేనిపక్షంలో తమకు చెబితే వినేలా చేస్తామని వ్యాఖ్యానించారు.
For More News..