జర్నలిస్టుగా, ఎమ్మెల్యేగా ఆయన సేవలు ప్రశంసనీయం

వరంగల్‌లో సురవరం ప్రతాప రెడ్డి 125వ జయంతి ఉత్సవాలు జరపడం గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరుమీద యూనివర్సిటీని స్థాపిస్తాం అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలను వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు జర్నలిజం పరిణామక్రమం సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రచయిత కసిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి, దేవులపెల్లి అమర్, విరహత్ అలీ, టంకశాల అశోక్, వేణుగోపాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

‘జర్నలిస్టులందరూ సురవరం ప్రతాపరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఒక జర్నలిస్టుగా, ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేశారు. ఇప్పుడు పని చేస్తున్న జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో మనం అణగదొక్కబడ్డాం. మహా కవి బొమ్మెర పోతన సమాధిని 10 కోట్లతో నిర్మిస్తున్నాం. యాదాద్రిని అభివృద్ధి చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు యాదాద్రిని నిర్లక్ష్యం చేశాయి’ అని ఆయన అన్నారు.