ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వచ్చిన వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి సౌకర్యాలు లేకుండా తాము ఎలా చదువుకోవాలంటూ స్థానిక బీఎస్సీ నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ మంత్రిని ఘెరావ్ చేసారు. డాక్లర్లు, అధికారులతో మెడికల్ కాలేజీ మీటింగ్ హాల్‍లో శనివారం సమీక్ష ముగించుకుని బయటకు వచ్చిన మంత్రికి.. స్టూడెంట్లు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. మంత్రి నేరుగా తన వాహానంలో ఎక్కేందుకు వెళ్తుండటంతో స్టూడెంట్లు ఆగ్రహించి ఆయన వెహికల్ ను కదలకుండా అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అరగంట పాటు నినాదాలు చేశారు. వాహనం ఎదుటే బైఠాయించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎంతకీ తనను కదలనీయకపోయేసరికి వాహనం దిగివచ్చిన ఈటల.. స్టూడెంట్లపై మండిపడ్డారు. ‘ఏం తమాషా చేస్తున్నారా.. ఆందోళనకు దిగడం మంచి పద్ధతేనా? అంటూ ఆగ్రహించారు.
ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారమవుతుందా? ఇక్కడే సంతకాలు చేయాలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. చివరకు వారితో కలిసి ఆడిటోరియం వరకు నడుచుకుంటూ వచ్చిన ఆయన.. గెస్ట్ హౌస్‍లోకి వెళ్లిపోయారు. స్టూడెంట్లను రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకువచ్చిన నర్సింగ్ కాలేజీ స్టాఫ్ ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాలేజీకి సొంత పక్కా భవనం లేదని, హాస్టల్ లేదని, రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఒక్కరు కూడా లేరని.. ఇలాంటి పరిస్థితులతో తాము ఎలా చదువుకోవాలంటూ స్టూడెంట్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడి పరిస్థితుల్లో చాలామంది స్టూడెంట్లు టీబీ వ్యాధి బారిన పడ్డారని పేర్కొన్నారు. మా సమస్యలను చెప్పుకునేందుకు వస్తే మంత్రి పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదంటూ స్టూడెంట్లు కంటతడి పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.