- కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్న
హైదరాబాద్: మంత్రి ఈటెల ను బలిపశువును చేసేందుకు టార్గెట్ చేశారు. అందుకే అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇరికించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. మంత్రి ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు.. హుటాహుటిన సీఎం కేసీఆర్ స్పందించి విచారణకు ఆదేశించిన వ్యవహారంపై దాసోజు శ్రవణ్ స్పందించారు. కేటీఆర్ , కేసీఆర్ ఫామ్ హౌస్ ల వ్యవహారం ఎందుకు బయటికి రావడం లేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి మల్లా రెడ్డి అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు బయట పడ్డా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. సీఎం కేసీఆర్ కు మంత్రి ఈటెల నచ్చడం లేదని.. ఈ కుట్ర మంత్రుల ఉద్వాసన చేస్తారనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తున్నదేనని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో కేసీఆర్ ఫెయిల్యూర్ అయ్యారని, మంత్రి ఈటెల ఎంతో కస్టపడి పనిచేస్తున్నారని అన్నారు. మంత్రి ఈటెల తన శాఖ లో పోస్టుల భర్తీ కూడా చేసుకోకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, కరోనా టైం లో కూడా డాక్టర్లు , మెడికల్ సిబ్బంది , పారామెడికల్ స్టాఫ్ లేక పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారని దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు.