
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు కేబినెట్‌లోనే లేని శాఖకు 20 నెలలుగా ఓ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తప్పును సరిదిద్దుకుంది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. 2022 మార్చిలో పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలో ఆప్ సర్కార్ ఏర్పడింది.
2023లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మాన్ సర్కార్ కుల్దీప్ సింగ్ ధాలివాల్‌కు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, ఎన్‌ఆర్‌ఐ అఫైర్స్ శాఖలు కేటాయించింది. 2024లో మరోసారి మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ చేసి, కొత్తగా ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంది. నలుగురిని తొలగించింది. ఈ క్రమంలో మంత్రివర్గ శాఖల కేటాయింపును సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అనే శాఖే లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ వెంటనే సీఎం మాన్ సూచనతో ఆ శాఖను రద్దు చేస్తూ పంజాబ్ సీఎస్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇకపై ధాలివాల్ కేవలం ఎన్‌ఆర్‌ఐ ఆఫైర్స్ శాఖను మాత్రమే నిర్వహిస్తారని గెజిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఆప్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక జోక్‌లా మార్చిందని విమర్శించారు. లేని శాఖను 20 నెలలుగా ఓ మంత్రి బాధ్యతలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. పంజాబ్‌లో అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ మంత్రి ఉన్నారు.. కానీ, అలాంటి శాఖ లేదు.. ఇది కేజ్రీవాల్ మోడల్ అని కేంద్ర సమాచార శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా శనివారం ట్వీట్ చేశారు.