రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు: రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌ వెళ్తున్న ఆయన సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద ఆగి.. ఐకేపీ సెంటర్‌‌‌‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేసిన అనంతరం మిల్లింగ్‌‌‌‌ చేసే వరకు రంగు మారకుండా ఉండేందుకే 17 శాతం తేమ నిబంధన పెట్టామని చెప్పారు. ప్రభుత్వం కొన్న వడ్లను మిల్లింగ్‌‌‌‌ చేసిన అనంతరం రేషన్‌‌‌‌ షాపుల ద్వారా ప్రజలకే పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పండించే సన్నాలను పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు మంచి ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు.

సోయా సేకరణలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉందన్నారు. కొనుగోలు చేసిన వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర సివిల్‌‌‌‌ సప్లై డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లిస్తే, అదనంగా ఇచ్చే రూ.500 ఆర్థిక శాఖ ద్వారా చెల్లించనున్నట్లు తెలిపారు. నవంబర్ 3వ వారం నాటికి 33 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తి అయ్యాయని, ఈ నెల చివరి నాటికి 14 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తవుతాయని అంచనా వేశామన్నారు. ఇందుకు అనుగుణంగా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులు వరి కొయ్యలు తగులపెట్టొదని,  దీని వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహించేలా ఆదేశాలను జారీ చేస్తామని, అవసరమైతే గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయిస్తామని చెప్పారు.