గీత కార్మికులకు మరో 10 వేల కాటమయ్య కిట్లు: మంత్రి పొన్నం

గీత కార్మికులకు మరో 10 వేల కాటమయ్య కిట్లు: మంత్రి పొన్నం
  • ఈ నెల 25లోపు రెండో విడత పంపిణీ: మంత్రి పొన్నం 
  • మొదటి విడతలో 15వేల మందికి కిట్లు ఇచ్చినట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తాళ్లు ఎక్కే గీతా కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం కిట్లను రెండో విడతలో 10వేల మందికి పంపిణీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 25వ తేదీ లోపు వీటి పంపిణీ పూర్తి చేస్తామాని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుడు జులై 14న  సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో కాటమయ్య కిట్ల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 5 వేల కిట్ల చొప్పున మూడు స్పెల్స్​లో మొత్తం 15 వేల మంది గౌడన్నలకు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో 10 వేల మందికి ఈ నెల 25 వ తేదీ లోపు జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా ఎక్సైజ్ అధికారి సంయుక్తంగా కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఏదైనా నియోజకవర్గంలో వృత్తిరీత్యా కల్లు గీతా కార్మికులు అందుబాటులో లేకుంటే అదే జిల్లాలోని మరొక నియోజకవర్గంలో ఉన్న వారికి పంపిణీ చేయోచ్చని సూచించారు.