
బాబు, పవన్, షర్మిల, పాల్ బీజేపీ వదిలిన బాణాలు
కరీంనగర్ టౌన్, వెలుగు: పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో డిఫరెంట్ వేషాలతో ప్రవేశిస్తున్న ఏపీ లీడర్లు 1956 నవంబర్1ని గుర్తుకు తెస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ లోని మీసేవ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిల, కేఏ పాల్ వేర్వేరు వేషాల్లో వచ్చినా అందరూ ఒకే తాను ముక్కలని, బీజేపీ వదిలిన బాణాలేనని ఆరోపించారు. ఏపీ మూలాలున్న లీడర్లకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. చంద్రబాబు పాతబిడ్డల్లారా రండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీళ్ల ఎజెండా అని, అందులో భాగంగానే చంద్రబాబు ఎంట్రీ ఇచ్చాడని విమర్శించారు.
ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేంతవరకు ప్రమాణం చేయని చంద్రబాబుకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పగలగొట్టి మళ్లీ తెలంగాణను ఎడారి చేయాలనుకుంటున్నారని, హైదరాబాద్ సంపదను, నీళ్లను ఎత్తుకెళ్లే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. తిరగబడకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. మన బొగ్గు, మన కరెంట్ ఎత్తుకుపోతారని గుర్తు చేశారు. తెలంగాణ రక్తం ఉన్న వాళ్లెవరూ చంద్రబాబు పార్టీలో చేరరని గంగుల అన్నారు. తల కిందికి, కాళ్లుపైకి పెట్టి యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలుగానీ, హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లు గానీ చంద్రబాబును నమ్మరని స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశమంతా బీఆర్ఎస్ వైపు చూస్తోందని వెల్లడించారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ కు అద్భుత మెజార్టీ వస్తుందన్నారు. అనంతరం స్థానిక 1,2వ డివిజన్లలో అభివృద్ది పనులను ప్రారంభించారు.